దేవుడు యెహోషువను సిద్ధపరుస్తూ చెప్పిన సూచనలు, క్రొత్త సంవత్సరము కొరకు సిద్ధపడుతున్న నీకు కూడ ఒక చక్కని సిద్ధపాటును ఇస్తాయని ఆశిస్తున్నాను.
దైవసేవకుడైన మోషే చనిపోయిన తరువాత దేవుడు యెహోషువను నిలబెట్టాడు. ఇది యెహోషువకు ఒక క్రొత్త ప్రారంభం. కాబట్టి ముందున్న పరిస్థితి కొరకు అతడు ఎలా సిద్ధపడాలి?
దేవుడు ఆయనకు ఇచ్చిన సిద్ధపాటులో కొన్ని అంశాలు ఇవి:
1. “నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము” (యెహోషువ 1:6): దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం యెహోషువను బలపరచింది గనుక దేవుని పనిని విశ్వాసంతో చేపట్టి సఫలుడైయ్యాడు. యేసు ప్రభువును ఆశ్రయించి, ఆయన మహిమ కొరకు జీవిస్తున్న నీకు కూడ ప్రభువు నిత్యమైన సహాయకుడిగా ఉంటాడని వాక్యము తెలియజేస్తుంది (హెబ్రీ 13:5,6). రాబోవు సంవత్సరములన్నీటిలో నీవు కూడ ఈ వాగ్దాన్నాన్ని జ్ఞాపకముంచుకోవాలి.
2. “…ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ 1:7,8): ఈ సంవత్సరము కొరకు నీవు తీసికొంటున్న నిర్ణయాల్లో ఇది అతి ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించి, వాక్యాన్ని అనుసరిస్తూ నీ జీవితాన్ని కట్టుకుంటూ, వాక్యాం గురించి ఎల్లప్పుడు సంభాషణ చేస్తూఉండాలి. ఈ పని ఆసక్తితో, ఆనందముతో చేయాలి. లేఖనాలకు ప్రథమ స్థానం ఇవ్వాలి. (కీర్తనలు 1:2,3; ఎజ్రా 7:10).
3. “యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడి…” (యెహోషువ 3:5): దేవుడు వారి మధ్య ఉన్నాడు గనుక ఇశ్రాయేలీయులు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తము చేత విమోచింపబడిన నీవు కూడ ఆయన కొరకు ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవించాలి. మీరు పరిశుద్ధులగుటయే …దేవుని చిత్తము. (1 థెస్స 4:3). పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము. (1 థెస్స 4:5). పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు. (హెబ్రీ 12:14). హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. (మత్తయి 5:8). ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. (1 థెస్స 4:2).
4. దేవుని మహిమ కొరకు సమస్తము ఉన్నది. “యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతని యొద్దకు వెళ్లి - నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా? అని అడుగగా అతడు - కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను.” (యెహోషువ 5:13): యెహోవా పక్షమున, యేసు క్రీస్తు పక్షమున, సమస్త కార్యములు జరుగుతున్నాయని నీవు గ్రహించడం ఎంతో ప్రాముఖ్యము. దేవుడు యెహోషువను అలా సిద్ధపరిచాడు. “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.” (రోమా 11:36). దేవుని మహిమ నిమిత్తం మనము ఉన్నాము. “It was never about you, it will never be about you,” అని అన్నాడు ఒక దైవజనుడు.
5. దేవుని కార్యాలను వచ్చు తరము వారికి తెలియజేయాలి. “వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను - రాబోవు కాలమున మీ సంతతివారు - ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా; అప్పుడు మీరు - ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును, మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.” (యెహోషువ 4:20-24): దేవుని కార్యాలను, యేసు క్రీస్తు యొక్క కార్యాలను ఇతరులకు తెలియజేయాలి. యెహోషువ వలె “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము,” అంటూ వచ్చు తరము వారికి సాక్షిగ నిలబడాలి. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించును గాక!
ప్రార్థన పూర్వకంగ సిద్ధపడు, ప్రయాసపడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచెను గదా!
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.