1 యోహాను 1:3 లో, విశ్వాసుల సహవాసము "తండ్రితోను మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను" ఉందని నిస్సందేహంగా వారికి వ్రాసాడు అపోస్తలుడైన యోహాను. ఆయన ఉపయోగించిన పదాలు ఎంతో బలంగా ఉన్నాయి కాబట్టి తర్జుమా చేసేవారు, “‘నిజంగా’ మన సహవాసం తండ్రితోను మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది” అని తర్జుమా చేసారు.
ఆ రోజుల్లో విశ్వాసుల (బాహ్య) పరిస్థితి చాలా దయనీయంగ మరియు నీఛంగ ఉండేది. వారి నాయకులు ‘లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఎంచబడేవారు.’ కాబట్టి తమతో సహవాసానికి ఇతరులను ఆహ్వానించాలంటే అభ్యంతరకరంగ కనిపించేది: “విశ్వాసులతో సహవాసం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? వారితో ఉంటే కష్టాలు, నిందలు, అవమానాలు, మరియు శ్రమలే కదా” అన్న భావన ఉండేది.
ఈ భావన తొలగించడానికి అపొస్తలుడైన యోహాను వారికి వ్రాస్తూ, ‘శరీర రీత్యా చూస్తే మనతో సహవాసం నష్టమే అన్నట్టుగ కనిపించవచ్చు కాని, వాస్తవానికి మనము కలిగి ఉన్నది చాలా గౌరవప్రదమైనది, మహిమాన్వితమైనది మరియు కోరదగినది’ అని తెలియజేస్తాడు. ఎందుకంటే, “నిజంగా, మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది.”
అపోస్తలుడైన యోహాను ఎంతో సూటిగ హృదయపూర్వకముగ ఈ మాటలు వ్రాస్తున్నాడు కాబట్టి మనము కూడ, “పరిశుద్ధుల సహవాసము దేవునితో ఉంది” అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
పాపము ఈ లోకంలోనికి ప్రవేశించినప్పటి నుండి, తమ పాపపు స్వభావం కారణంగా ఏ మనిషి దేవునితో సహవాసం చేయలేదు. ఆయన వెలుగు; మనము చీకటి; వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? (2 కొరింథీ. 6:14). ఆయన జీవము; మనము మృతులము. ఆయన ప్రేమ; మనము శత్రుత్వం. ఆయనతో మనకు పొత్తు (సహవాసము) కుదురుతుందా? క్రీస్తు లేని, నిరీక్షణ లేని, లోకంలో దేవుడు లేని స్థితి మనది (ఎఫెసీ. 2:12). మనుష్యులు “తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడ్డారు” (ఎఫెసీ. 4:18). ఆలోచించండి, “సమ్మతింపకుండ ఇద్దరు కలిసి నడవగలరా?” (ఆమోసు 3:4). దేవునికి మనిషికి మధ్య ఈ దూరం ఉన్నప్పుడు, వారు కలిసి సహవాసంలో నడవడం అసాధ్యం.
దేవుని పట్ల మనకున్న మొదటి ఆసక్తి పాపము వలన పోయింది. మనము ఆ ఆసక్తిని మరల పుట్టించుకోలేని స్థితిలోకి దిగజారాము. ఆయన వద్దకు తిరిగి రావడానికి కావలసిన శక్తంతటిని కోల్పోయాము. అంతేకాదు, దేవుడు కూడ ఏ విధమైన మార్గమును కనుపరచలేదు. పాపులు ఆయనతో సమాధానపడుటను ఉద్దేశించి దేవుడు ఏ విధమైన వివరణ ఇవ్వలేదు.
దేవుడు క్షమించి తన కృపను దయను చూపించడమే మనకున్న ఏకైక ద్వారము. ఆ సహవాసం మరల కలగాలంటే ఇదొక్కటే మార్గం. అయితే, అది ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తి చేతికి (యేసు క్రీస్తుకు) అప్పగించబడింది. ఆయనలో మాత్రమే అది కనుపరచబడింది. ఈయనే ఆ కృపను దయను సంపాదించాడు. ఈయన ద్వారా మాత్రమే అది మనకు ఇవ్వబడుతుంది. తండ్రి తన హృదయమును ఆయన ద్వారా మాత్రమే బయలుపరిచాడు.
అందుకే, పాత నిబంధనలో దేవునితో ఈ సహవాసమును గురించి స్పష్టంగా ప్రస్తావించబడలేదు. అక్కడ ఉంది, కానీ దాని స్పష్టత మరియు విశ్వాసమను బట్టి కలిగే ధైర్యం, క్రొత్త నిబంధన యొక్క సువార్తలో మాత్రమే చూస్తాము. పరిశుద్ధాత్ముడు దీనిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముని వలన నిరాటకంగ (స్వాతంత్ర్యము) ఆ సహవాసం మనకు కలుగుతుంది (2 కొరింథీ. 3:17,18).
అబ్రాహాము దేవుని స్నేహితుడు (యెష. 41: 8). దావీదు దేవుని హృదయానుసారుడు. హనోకు దేవునితో నడిచాడు (ఆది 5:22). వారందరూ ఈ సహవాసం యొక్క వాస్తవికతను అనుభవించారు. అయితే మొదటి ప్రత్యక్ష గుడారం నిలబడి ఉన్నంత కాలం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపించలేదు (హెబ్రీ. 9: 8).
వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ, వారికి ‘పరేసియన్’ [NT:3954], అనగా నిర్భయము, ధైర్యం లేదు (ఎఫెసీ. 3:12). మన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే అది వచ్చింది. (హెబ్రి 4:16, 10:20). కాబట్టి, పాత నిబంధనలో ఉన్నవారిపై ముసుగు అలాగే ఉంది. వారికి ‘ఎలుటేరియన్’ [NT:1657], అనగా దేవున్ని చేరుటలో ‘నిరాటంకము, స్వాతంత్ర్యము’ లేదు. (2 కొరింథీ. 3:15, 16).
కానీ క్రీస్తులో ఇప్పుడు ‘ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి’ (ఎఫెసీ. 3:12). పాత నిబంధన భక్తులకు దీని గురించి తెలియదు. ఈ దూరం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తొలగించబడుతుంది. ఆయన తన శరీరము అను తెరద్వారా మనకొరకు నూతనమైన జీవముగల మార్గమును ప్రతిష్ఠించాడు (హెబ్రి 10:19). ఆయన ద్వారానే మనము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము. (ఎఫెసీ 2:18). మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మన సమాధానమైయున్నాడు. (ఎఫెసీ 2:13,14).
నూతనమైన ఈ పునాదిపై, నూతనమైన జీవముగల ఈ మార్గం ద్వారా, పాపులు దేవునితో సహవాసంలోకి ప్రవేశిస్తారు. వారు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. పాపులు దేవునితో, అనంత పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయడం నిజంగా ఆశ్చర్యపరిచే ఏర్పాటు.
[ఈ వ్యాసము John Owen గారు రచించిన “దేవునితో సహవాసము” (Communion with God) అనే విలువైన పుస్తకములోనుండి సంగ్రహించబడినది. తరువాయి భాగము వచ్చేవారం ప్రచురణ చేయబడుతుంది. ప్రార్థించగలరు].
John Owen (1616 – 1683) is a renowned puritan pastor and theologian. He also worked as Vice-Chancellor at the University of Oxford. He authored many books including Communion with God.