logo
logo

ఈ సహవాసం ఎలాంటిది?

"Communion with God" పుస్తక అనువాదము. Part 1; Chapter 1; Section B. రచయిత: John Owen.

  • Article by John Owen (1616 – 1683)
    March 23, 2022
  • ‘సహవాసం’ అనేది వ్యక్తులకు, విషయాలకు సంబంధించి ఉంటుంది. కలిసి ఏదైన ఒక దాంట్లో పాల్గొనడాన్ని సహవాసం అంటారు. అది మంచైనా చెడైనా, సంతోషమైనా భాద్యతైనా, స్వభానమైనా చర్యలైనా, ఉమ్మడిగా పాల్గొనడమే సహవాసం.

    ఉదాహరణకు, మనుష్యులందరు ఒకే స్వభావాన్ని పంచుకుంటారు కాబట్టి ఆ స్వభావంలో వారు సహవాసం కలిగి ఉన్నారని అర్థం. ఏర్పరబడినవారిని ఉద్దేశిస్తూ హెబ్రి పత్రికలో, ఆ పిల్లలు “రక్తమాంసములు” (మనుష్య స్వభావము) “గలవారైనందున” (పంచుకొనుట లేదా పాల్గొనుట), “క్రీస్తు కూడ రక్తమాంసములలో పాలివాడాయెను” అని చెప్పబడింది (హెబ్రి 2:14).

    అలాగే, మనముంటున్న స్థితినిబట్టి కూడా సహవాసం ఏర్పడుతుంది. అది మంచి చెడులైనా లేదా ఆత్మసంబంధమైన స్థితియైనా - విశ్వాసులు ఈ స్థితిలో ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు ఇద్దరు దొంగలతో కలిసి ఒక స్థితిని పంచుకున్నాడు. వారికందరికి సిలువ మరణం విధించబడింది (లూక 23:30). వారు శ్రమపొందాలని తీర్పు తీర్చబడి, భయంకరమైన దుఃఖ స్థితిని పంచుకున్నారు. వారిలో ఒకడు ప్రభువును బ్రతిమిలాడి, ప్రభువు వెళ్ళబోయే ఆ మంచి స్థితిని పొందుకున్నాడు.

    అంతేకాకుండా, అవి మంచివైనా చెడ్డవైనా, చేసే క్రియలను బట్టి కూడా సహవాసం ఏర్పడుతుంది. విశ్వాసులు సువార్తలో పాలివారవుట (ఫిలిప్పీ 1:5), లేదా కలిసి దేవున్ని స్తుతించి ఆరాధించుట మొదలైనవి మంచి క్రియల వలన కలిగే సహవాసం. ఇవే క్రియలలో దావీదు కూడా ఆనందించాడు (కీర్తనలు 42:4). షిమ్యోను, లేవి కలిసి తమ పగ తీర్చుకోడానికి ఇతరులను చంపడం చెడ్డ క్రియలవలన కలిగే సహవాసానికి ఒక ఉదాహరణ (ఆది 49:5).

    అయితే, దేవునితో మన సహవాసం వీటిలో ఒకటి కాదు. దేవునితో మన సహవాసం స్వాభావికంగా కలిగే అవకాశం లేదు. స్వచ్చందంగా, ఇష్టపూర్వకంగా, సమ్మతి చొప్పున కలగాలి. ఉంటున్న స్థితినిబట్టి కలిగే అవకాశం లేదు. క్రియల వలన కలగాలి. ఇతరుల కొరకు చేసే క్రియల వలన కాదు. ఆయనకు మనకు మధ్య జరిగే క్రియల వలన కలగాలి.

    దేవునికి మనిషి మధ్య ఉన్న అనంతమైన అసమానత కారణంగా వారి మధ్య స్నేహం ఉండదని నిర్ధారించాడు ఒక గొప్ప తత్వవేత్త (అరిస్టాటిల్). అతను స్నేహితుల మధ్య కొంత సాన్నిహిత్యాన్ని అనుమతించగలిగాడు; కానీ అతని అవగాహనలో, దేవునికి మనిషికి మధ్య సాన్నిహిత్యానికి చోటు లేదు. ఇంకొకాయన, “దేవునికి మనిషికి మధ్య ఒక నిర్దిష్ట సహవాసం ఉన్నప్పటికీ, అది పరిపాలన వలన కలిగే సాధారణ పరస్పర చర్య మాత్రమే” అని అన్నాడు. మరికొందరు ఈ సహవాసాన్ని గురించి కొంచం ఉన్నతంగా మాట్లాడారు, కానీ వారు మాట్లాడుతున్నదేంటో వారికి అర్థం కాలేదు. ఈ జ్ఞానం క్రీస్తులో దాగి ఉంది. ఎంతో అద్భుతమైన ఈ జ్ఞానాన్ని పాపముతో ఉన్న మనము గ్రహించలేము. స్వంత ఊహలు ఆందోళన మరియు మరణ భయాన్ని మాత్రమే కలిగిస్తాయి. కాని, మనము ఇంతకుముందు చూసినట్లు, మనకు ఒక క్రొత్త పునాది, క్రొత్త ఆధిక్యత ఉంది.

    వారి మధ్య ఉన్న ఐక్యత ఆధారంగా ఇరువురికి ఇష్టమైనవాటిని పరస్పరము పంచుకోవడమే నిజమైన సహవాసం. దావీదు యోనాతానుల మధ్య అదే జరిగింది. ప్రేమ వలన వారి ఆత్మలు పెనవేసుకుపోయాయి (1 సమూ 20:17). తద్వార వారి మధ్య ఐక్యత ఏర్పడింది. ఆ ప్రేమలోనుండి పుట్టిన వాటంనిటిని వారు పరస్పరము పంచుకున్నారు.

    ఆత్మ సంబంధమైన విషయాలలో ఇది మరింత విశిష్టంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన సహవాసాన్ని అనుభవించేవారికి అత్యంత అద్భుతమైన ఐక్యత పునాదిగా ఉంది; ఈ ఐక్యతలోనుండి వారు పరస్పరం పంచుకునేవి అత్యంత విలువైనవి మరియు ప్రాముఖమైనవి. ‘దేవుడు తనను తాను మనకు ఇవ్వడం, మనము దేవునికి ఆయన అడిగిన వాటిని తిరిగి ఇవ్వడం,’ ఇది దేవునితో మన సహవాసం. యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనకున్న ఐక్యతలోనుండి ఇవి ప్రవహిస్తాయి.

    ఈ సహవాసం రెండు దశలు: 1. పరిపూర్ణమైన, సంపూర్ణమైన సహవాసం. ఇది ఆయన మహిమ యొక్క పూర్తి ఫలం. మనము పూర్తి విధేయతతో ఆయనలో విశ్రాంతి తీసుకోవడం. ఈ రకమైన సహవాసాన్ని మనము నిత్యత్వంలో అనుభవిస్తాము. 2. ప్రారంభ మరియు అసంపూర్ణమైన సహవాసం. ఇది మనకు ఇక్కడ, ఇప్పుడు ఆయన దయ వలన కలిగేది. ఇది పరిపూర్ణత యొక్క ప్రథమ ఫలము. ఈ రకమైన సహవాసాన్ని గురించి నేను వివరించబోతున్నాను.

    యేసు రక్తంతో ఆమోదించబడిన సమాధాన నిబంధనలో పరిశుద్ధులు ఇప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగియున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవుడు తన కృపా మహదైశ్వర్యం చొప్పున శత్రువులుగా ఉన్న మనకు ఆయనతో సహవాసాన్ని తిరిగి అనుగ్రహించాడు.

    ఈ పుస్తకములో అయన దయగల మాటలను చదివేవారు అయన మాధుర్యాన్ని మరియు శ్రేష్ఠతను రుచి చూడాలని, తద్వార తమ రక్షణ పరిపూర్ణత కొరకు మరియు ఆయన మహిమ యొక్క సంపూర్ణత కొరకు మరింత ఆసక్తితో ఆపేక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను.

    [ఈ వ్యాసము John Owen గారు రచించిన “దేవునితో సహవాసము” (Communion with God) అనే విలువైన పుస్తకములోనుండి సంగ్రహించబడినది. తరువాయి భాగము వచ్చేవారం ప్రచురణ చేయబడుతుంది. ప్రార్థించగలరు].

    John Owen (1616 – 1683) is a renowned puritan pastor and theologian. He also worked as Vice-Chancellor at the University of Oxford. He authored many books including Communion with God.

    Popular
    Books
  • John Bunyan (1628 – 1688)
  • యాత్రికుని ప్రయాణం

    ఆత్మీయ పోరాటమును, ప్రయాణమును, జాన్ బణ్యన్ గారు ఈ పుస్తకంలో అద్భుతముగా వివరించారు
    Sermon
  • Joseph Livingston
  • దేవుని లక్ష్యం

    Sermon
  • Paulson Vasala
  • ఆత్మలో మూలుగుచు మహిమ కొరకు నిరీక్షించుచు

    Life Eternal
    Unto God be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.
    Contact Us | +91 9493994995, 8341119183All Rights Reserved.