logo
logo

తండ్రితో విభిన్నమైన సహవాసం

విశ్వాసులకు తండ్రితో ప్రత్యేకమైన సహవాసం ప్రాముఖ్యంగా దేని ద్వారా కలుగుతుంది? ఆ ప్రత్యేకత ఏమిటి.

  • Article by John Owen (1616 – 1683)
    May 5, 2022
  • విశ్వాసులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారని, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతో వేర్వేరుగా ఈ సహవాసాన్ని అనుభవిస్తున్నారని గడచిన వారాల్లో మనం చూసాము.

    ఈ శీర్షికలో, తండ్రితో ప్రత్యేకంగా దేని వలన మనకు సహవాసం కలుగుతుంది అనేది చూద్దాం.

    ముందుగా కొన్ని విషయాలు:

    1. దీని వలన మనకు తండ్రితో సహవాసం కలుగుతుంది అని అంటున్నప్పుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దాంట్లో లేరన్నది నా అభిప్రాయం కాదు. నేనేమంటున్నానంటే ‘ప్రధానంగా’ లేదా ‘ప్రాముఖ్యంగా’ దీని వలన తండ్రితో మనకు సహవాసం కలుగుతుంది.

    2. దేవుడు చేస్తున్న ఏ కార్యములోనైనా ముగ్గురి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు ‘విశ్వాసం’ చూడండి: తండ్రి విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు (ఎఫెసీ 2:8), కుమారుడు దాన్ని సంపాదిస్తాడు (ఫిలిప్పీ 1:29), పరిశుద్ధాత్మ వలన ఆ విశ్వాసం క్రియారూపం దాల్చుతుంది. (ఎఫెసీ 1:19,20; రోమా 8:11).

    3. దీని వలన మనకు తండ్రితో సహవాసం కలుగుతుంది అని అంటున్నప్పుడు, ఇతర మాధ్యమాలను నేను నిరాకరించట్లేదు. త్రియేక దేవునితో వేర్వేరుగా సహవాసం కలిగి ఉన్నాం అన్నది రుజువుపరచడానికి మాత్రమే ఈ ప్రత్యేకతను చూపిస్తున్నాను.

    4. తండ్రితో మనకున్న సహవాసాన్ని దీనికి మాత్రమే పరిమితం చేయట్లేదు.

    మంచిది, ఇప్పుడు ఆ ప్రత్యేకతను చూద్దాం. విశ్వాసులకు తండ్రితో ప్రత్యేకమైన సహవాసం ప్రాముఖ్యంగా దేని ద్వారా కలుగుతుంది?

    ప్రేమ ద్వారా. ఉచితమైన, అర్హత లేని, శాశ్వతమైన ప్రేమ. “తండ్రి“ ఈ ప్రేమను పరిశుద్ధులపై ఉంచుతాడు. విశ్వాసులు తండ్రిలో దీన్ని చూడాలి, దీన్ని తండ్రి నుండి పొందుకోవాలి, మరియు (ఆయన ఆశించిన పద్ధతుల్లో) తిరిగి దీన్ని ఆయనకు ఇవ్వాలి. సువార్తలో మనం కనుగొన్న గొప్ప సత్యమిదే. సాధారణంగా తండ్రిని గురించి ఆలోచించినప్పుడు ఆయన యొక్క ఉగ్రతను, కోపాన్ని, ఆగ్రహాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. అవును మనుష్యులు అంతకు మించి ఆయనను గురించి ఆలోచించలేరు (రోమా. 1:18; యెషయా. 33:13-14; హబక్కూకు. 1:13; కీర్తనలు. 5:4-6; ఎఫెసీ. 2:3). కాని, సువార్తలో ఆయన ‘ప్రేమ’ అని బయలుపరచబడ్డాడు. మన పట్ల నిండు ప్రేమ కలిగి యున్నాడు. ఈ సత్యము సువార్త ద్వారా మాత్రమే వ్యక్తీకరించబడింది (తీతు 3:4-7).

    1. “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8 లో మనం చూస్తాము. ఇది తండ్రిని గురించి వ్రాయబడిన మాట అని 9వ వచనములో చూడవచ్చు. తండ్రి ప్రేమాస్వరూపి గనుక ‘మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను.’ నిర్గమకాండం 34:6,7 లో వ్రాయబడినట్లు ఆయన ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు’ మాత్రమే కాకుండ ప్రధానంగా ఉచిత ప్రేమలో తనను తాను మనకు అప్పగించుకొంటున్నాడు. “ఇందులో ప్రేమ ఉంది,” దీన్ని గ్రహించండి అని యోహాను ఈ సత్యాన్ని మనముందుంచుతున్నాడు.

    2. “ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకందరికిని తోడైయుండును గాక” అని 1 కొరింథీ 13:14 లో పౌలు ఇచ్చిన ఆశీర్వాదం మనం గమనించాలి. ఇక్కడ పౌలు, ఇతర విషయాలను ప్రభువుకు మరియు ఆత్మకు ఆపాదిస్తూ, తండ్రికి మాత్రం ప్రేమను ఆపాదించాడు. యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మలో మనకు కలుగుతుంది. అందుకే ఇలాంటి ఆశీర్వచనము లేఖనములో మనం చూస్తాము.

    3. “నేను మీ విషయమై తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.., తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు” అని యోహాను 16:26,27 లో ప్రభువు శిష్యులతో అన్నాడు. ‘నేను మీ విషయమై తండ్రిని వేడుకొనను’ అని ప్రభువు ఎందుకంటున్నాడు? మన పక్షమున విజ్ఞాపన చేసేది ఆయనే కదా! ప్రభువు ఆ మాట ఎందుకంటున్నాడంటే, శిష్యులకు ప్రభువు యొక్క ప్రేమ తెలుసు. ఆయన వారిని విడచి వెళ్ళిన తరువాత కూడా వారిని మరచిపోడని వారికి తెలుసు. కాని, ఇప్పుడు వారి ఆలోచనలన్నీ తండ్రిని గురించి. ‘తండ్రి వారిని ఎలా అంగీకరిస్తాడు,’ ‘ఎలాంటి వైఖరి తమ యెడల కనుపరుస్తాడు’, అన్న చింత. కాబట్టి మన ప్రభువు వారితో, “దాని గురించి మీరు చింతించకండి. ఈ విషయములో నేను తండ్రిని బలవంతం చేయవలసిన అవసరం లేదు. ‘తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.’ మీకొరకు ఆదరణకర్తను పంపమని నేను తండ్రిని వేడుకోవాల. కాని, మీపైన ఆయనకున్న ఆ ఉచితమైన శాశ్వతమైన ప్రేమ కొరకు వేడుకొనవలసిన అవసరత లేదు. తండ్రి తానే మిమ్మును అమితంగా ప్రేమించుచున్నాడు. కాబట్టి, ఇది గ్రహించి, ఇంకేమాత్రము చింతించకుండా, ఆ ప్రేమలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి,” అని శిష్యులను ఈ భావనతో ధైర్యపరచాడు.

    4. అపోస్తలుడైన పౌలు, రోమా 5:5 లో, “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” అని బోధించాడు. ఇక్కడ, తండ్రి యొక్క ప్రేమను గూర్చి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు దీన్ని కుమ్మరిస్తాడని, కూమరుడు దీనికొరకు పంపబడ్డాడని చెబుతూ, తండ్రికి మాత్రం ప్రేమను ఆపాదిస్తున్నాడు. ఇంకా స్పష్టంగా 2 కొరింథీ 13:11 లో, “ప్రేమకు కర్తయగు దేవుడు” అని వ్రాయబడింది.

    తండ్రిలో ఈ ప్రేమ ప్రత్యేకంగా, ప్రధానంగా కనిపించుచున్నది గనుక ఇది అన్ని తదుపరి దీవెనలకు మూలం అని మనం గ్రహించాలి. క్రైస్తవులు తరచుగా తండ్రి తమ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో అనే విషయంలో చాలా ఆందోళన పడుతుంటారు. ప్రభువు యొక్క మంచితనము గూర్చి అంతగా సందేహపడరు. కాని తండ్రి వారిని ఎంతవరకు అంగీకరించాడనే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. వారి పట్ల ఆయన హృదయం ఎలా ఉంది? “తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలును” (యోహాను 14:8) అని ఆశిస్తారు. ఆయన ప్రేమ తదుపరి దీవెనలన్నీటికి మూలం అని మనం గ్రహించాలి. తీతు 3:3-5 లో పౌలు అలా వివరించాడు. “మనము మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి.” మరి మన క్షేమము ఎలా కలుగుతుంది? “మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు…” తండ్రి యొక్క ప్రేమ వలననే. ఆ తదుపరి, “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.” అందుకే మనలను ఆదరించడానికి ఎన్నో సాదృశ్యాలతో (అవి బలహీనమైనవి అయినప్పటికి) తండ్రి ప్రేమ లేఖనములలో చూపించబడింది. నిజమైన తండ్రి వలె, తల్లి వలె, కాపరి వలె, కోడి తన పిల్లలను వలె, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. (కీర్తనలు. 103:13; యెషయా. 63:16; మత్తయి. 6:6; యెషయా. 66:13; కీర్తనలు. 23:1; యెషయా. 40:11; మత్తయి. 23:37.)

    [ఈ వ్యాసము John Owen గారు రచించిన “దేవునితో సహవాసము” (Communion with God) అనే విలువైన పుస్తకములోనుండి సంగ్రహించబడినది]

    John Owen (1616 – 1683) is a renowned puritan pastor and theologian. He also worked as Vice-Chancellor at the University of Oxford. He authored many books including Communion with God.

    Popular
    Books
  • John Bunyan (1628 – 1688)
  • యాత్రికుని ప్రయాణం

    ఆత్మీయ పోరాటమును, ప్రయాణమును, జాన్ బణ్యన్ గారు ఈ పుస్తకంలో అద్భుతముగా వివరించారు
    Sermon
  • Joseph Livingston
  • దేవుని లక్ష్యం

    Sermon
  • Paulson Vasala
  • ఆత్మలో మూలుగుచు మహిమ కొరకు నిరీక్షించుచు

    Life Eternal
    Unto God be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.
    Contact Us | +91 9493994995, 8341119183All Rights Reserved.