సహజంగా వివాహం అనగానే యువతకు ఎన్నో ఆశలుంటాయి. పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ (ప్రధానం) అయిన తరువాత.. పెళ్లికి ముందు నూతన వధువు, వరుడు భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటూ.. ఊహాల్లో తేలియాడుతుంటారు. అయితే మరియతో ప్రధానం చేయబడిన యోసేపు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడో చదువండి.
నాటి యూదుల ఆచారం ప్రకారం.. వివాహ విషయమై పెద్దల సమక్షంలో పురుషునితో ప్రధానం చేయబడిన స్త్రీ, మరో పురుషునితో లైంగిక సంబంధం కలిగుంటే ఆమెను బహి రంగంగా శిక్షించడం యూదుల సంప్రదాయం.
యూదుల ధర్మశాస్త్రం ప్రకారం.. ‘‘ఒక పురుషుడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైంగిక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి మీరు తొలగించాలి. మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. అతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లతో కొట్టి చంపాలి.’’ (ద్వి.కా 22:22-24).
యోసేపు ప్రమేయం లేకుండా మరియ గర్భవతి అయిందనే సమాచారం యోసేపుకు తెలిసినప్పుడు తన గుండె అగినంత పనైంది. వివాహ విషయమై తాను కన్న కలలు ఎండ వేడిమికి మంచు కరిగినట్లు కరిగిపోయాయి. ఆ సందర్భంలో.. “మరియ నన్ను ఎందుకు మోసం చేసింది? ముందే ఎవరినైన ప్రేమిస్తే, నాతో వివాహనికి ఎందుకు ఒప్పుకుంది? ఆమె ఎవరి వల్ల గర్భవతి అయింది?” అని యోసేపు అనుకుని ఉండొచ్చు!
యోసేపు స్థానంలో మనలో ఎవరైన ఉంటే ఏం చేస్తాం? భేషరత్తుగా మరియను నిలదీసి, పెద్దల సమక్షంలో బహిరంగంగా శిక్షిస్తాం. అయితే.. యోసేపు అలా చేయలేదు. మరియను సమాజంలో అవమానించకుండా రహస్యంగా విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు..
పరలోకం నుండి దేవునిచే పంపబడిన దూత యోసేపుతో మాట్లాడాడు. ‘‘..యేసుక్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహం కాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అవమానపరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగ తెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు. అతడీ విధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, ‘‘యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు’’ అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: ‘‘కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు’’ ఇది నిజం కావటానికే ఇలా జరిగింది’’ (మత్తయి 1:18`23).
దూత ద్వారా దైవ వర్తమానాన్ని విన్న యోసేపు, దేవుని చిత్తానికి లోబడినాడు. ప్రవక్త ప్రవచించినట్లు ` కన్యక గర్భవతియై మగ శిశువుకు జన్మనిస్తుంద నే ప్రవచనం నెరవేర్పులో భాగంగా.. మరియ గర్భం దాల్చిందని యోసేపు గ్రహించాడు. మరియ, తనను మోసం చేయలేదని, దైవశక్తి వల్ల ఆమె గర్భవతియైదని నిర్ధారణ చేసుకున్నాడు.
మంచి స్నేహితుడై తన ఇంటిలోకి చేర్చుకుని, కంటికి కనుపాపలా చూసుకున్నాడు. కానీ, ఆమె ప్రసవించే వరకు ఆమెతో లైంగికంగా కలువలేదు. ‘‘యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు..’’ (మత్తయి 1:24-25).
మరియ గర్భానికి సంబంధించిన సత్యం యోసేపుకు తెలుసు. కాని, తన ఇంటి వారికి, లేఖనాలను బోధించే శాస్త్రులకు, పరిసయ్యులకు, ఆనాటి సభ్య సమాజానికి తెలియదు. అందువల్ల.. ఆనాటి సమాజం ` చెడిపోయిన స్త్రీతో యోసేపు ఎందుకు సంసారం చేస్తున్నాడు? ఆమెను తన ఇంటిలోకి ఎందుకు చేర్చుకున్నాడు? పెళ్ళికి ముందే ఇద్దరు శరీరకంగా కలిసారా అనే మాటలు బహుశ మాట్లాడి ఉండొచ్చు! వాటివల్ల యోసేపు హృదయం ఎంత నలిగిపోయిందో!
దేవుని చిత్తం, ప్రవచన నెరవేర్పు కోసం యోసేపు నిందలు, దూషణలు, అవమానాలను సహించాడు, భరించాడు. ప్రియ పాఠకులారా, పాపులమైన మన కోసం పరిశుద్ధుడైన దేవుడు, మానవునిగా జన్మించి, సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనం ప్రభువు చిత్తాన్ని గుర్తించామా? మనం ఏం చేయాలో, చేయకూడదో వాక్యంలో తెలియజేసిన దైవ చిత్తాన్ని చదివమా? విన్నామా? పరిశీలించి.. ఆయన చిత్తప్రకారం జీవిస్తున్నామా?
యోసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంవల్ల..
1. మరియ, సకల మానవాళి రక్షకుడైన క్రీస్తుకు సుళువుగా జన్మనిచ్చింది. 2. అనేకుల రక్షణకు ద్వారం తెరచుకుంది.
యోసేపు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల కలుగబోయే ప్రతిఫలాలను ఆయన చూడలేదు. అయినా.. ఆయన దేవునికి విధేయత చూపాడు. నేడు మనం, దేవుని చిత్త ప్రకారం జీవిస్తే.. ఎందరో క్రీస్తును తెలుసుకోడానికి సుళువవుతుంది. ఇతరుల రక్షణకు మనం అడ్డు బండలుగా ఉన్నామా? స్వపరిశీలన చేసుకోవాలి.
వ్యక్తిగత జీవితాల్లో దేవుడు అనుమతించిన శ్రమలు, నిందలు, అవమనాలు మొదలగు వాటి వెనకున్న దేవుని చిత్తాన్ని చూడడానికి పరిశుద్ధాత్ముడు మన మనో నేత్రాలను తెరచును గాక! శ్రమలు భరిస్తు.. తండ్రియైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రభువు సహయం చేయును గాక!
Shanthi Raju Palle is a journalist and also the editor of Prakshalana, a christian monthly magazine.