క్రొత్తనిబంధన విశ్వాసులకు ఉన్నంత స్పష్టత పునరుత్థానము గురించి పాతనిబంధన విశ్వాసులకు లేదనే చెప్పాలి. ఈ యుగము ఎలా అంతమవబోతుందో, చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడో మొదలైన వాటిని గురించిన జ్ఞానం ముందునుండి ఉన్నప్పటికి, దాని స్పష్టత క్రమంగా పెరుగుతూ వచ్చింది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచుట ద్వారా అది మరింత స్థిరపరచబడింది.
పాతనిబంధనలో పునరుత్థానమును సూచించే కొన్ని లేఖనభాగాలు.
కీర్తనల్లో 16, 17, 49, 73 ముఖ్యమైనవి. 16వ కీర్తన 10-11 వచనాల్లో, “యేహోవా… నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు,” అని కీర్తనకారుడు తన ధైర్యాన్ని తెలియజేసాడు. ఈ వచనాన్ని వివరించే అనేకులు ‘దేవుడు తనను మరణానికి అప్పగించడు, చనిపోనివ్వడు’ అంటున్నాడని అంతవరకే దీని అర్థాన్ని పరిమితం చేసారు. కాని వాస్తవానికి అతడు పునరుత్థానము గురించి మాట్లాడుతున్నాడు. అందుకే పేతురు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ వాక్యభాగాన్ని ఎంచుకున్నాడు. ఈ వచనాల్లో కేవలం మరణం తప్పించబడుట మాత్రమే కాకుండ మరణంపై దేవుని విజయాన్ని తలపోస్తున్నాడు.
17వ కీర్తనలో కీర్తనకారుడు దుష్టుల భవిష్యత్తుకు, విశ్వాసుల భవిష్యత్తుకు మధ్య ఉన్న తేడాను వివరిస్తాడు. ఈ క్రమంలో తనను గూర్చి తాను ధైర్యంగా, “నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును” అని అంటాడు. పాతనిబంధన పరిధిలో ఈ మాటలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడ పునరుత్థానం యొక్క ప్రస్థావన ఉంది అని, మరి ముఖ్యంగ, “నేను మేల్కొనునప్పుడు” అంటున్నాడు కాబట్టి పునరుత్థానాన్ని గురించే మాట్లాడుతున్నాడని మనము నిస్సందేహంగ చెప్పవచ్చు.
49 కీర్తనలో కూడా దుష్టుల మరియు విశ్వాసుల భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు తనను గూర్చి తాను, “పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును” అని చెబుతూ “దేవుడు నన్ను చేర్చుకొనును” అని అంటాడు. ఈ మాటల్లో కేవలం పాతాళము (మరణము) నుండి తప్పించడం మాత్రమే కాకుండ మరియెక్కువ మేలు దేవుడు చేయబోతున్నాడు అనే అర్థం ఉంది.
73వ కీర్తన 23,24 వచనాల్లో భక్తుడు ఇలా అన్నాడు: “అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.” ‘మహిమ’ అంటున్నప్పుడు రచయితకు ఎంత అవగాహన ఉందో చెప్పలేము గాని రాబోయే దాన్ని గొప్ప ఆశీర్వాదంగా పరిగనిస్తున్నాడని చెప్పవచ్చు. 25,26 వచనాల్లో మరింత స్పష్టంగా, “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను (క్షీణించిపోయినప్పుడు) దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు,” అని అన్నాడు. యేహోవా యొద్ద ఎల్లప్పుడు ఉండి, ఆయనతో సహవాసంలో ఎదుగుతున్నాడు గనుక ఈ బంధము శాశ్వతంగా భద్రపరచబడుతుందని నిశ్చయతతో ఉన్నాడు.
పంచగ్రంథాల్లో (ఆదికాండము-ద్వితీయోపదేశకాండము) నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఆదికాండం 5:24 లో హనోకు గురించి వ్రాయబడింది. ఈ వాక్యభాగంలో అందరిని గూర్చి అంటున్నట్టు “అతడు మృతిబొందెను” అనే మాట హనోకు విషయంలో వాడలేదు. “అతడు లేకపోయెను” అని చెప్పబడింది. అంటే అతడు ఇంక కనిపించలేదు. అతడు దేవుని చెంతకు చేర్చబడ్డాడు. “దేవుడతని తీసికొనిపోయెను” అనే మాటలు, దేవునితో అతనికి దొరికిన నూతన దగ్గరి సాన్నిహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ కూడ కీర్తనలలో ఉన్నట్టే దేవుడతని ఎక్కడికి తీసికొనిపోయాడో వ్రాయలేదు. ఈ సంఘటనను ఏలియాతో పోల్చితే, ఏలియా “పరలోకమునకు ఆరోహణమాయెను” అనే మాట ఉంటుంది.
ఏదేమైనప్పటికి, ఈ వాక్యభాగంలో పునరుత్థాన జ్ఞానము యొక్క మూలాలు చూడవచ్చు. హనోకునకు, ఏలియాకు జరిగినట్టే మనకు కూడ జరుగుతుందని ఎవ్వరూ అనుకొనియుండరు గాని చనిపోయిన తరువాత విశ్వాసికి ఏం జరుగబోతుందో ఇక్కడ బీజరూపంలో వారికి చూపించబడింది.
పంచగ్రంథాల్లో మరొక వాక్యభాగం బిలామును గూర్చినది. సంఖ్యాకాండము 23:10 లో బిలాము, “నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటిదగును గాక అనెను.” ఈ లేఖనాలలో బిలాము ఇశ్రాయేలు యొక్క చివరి దశ (ముగింపు) ఎలా ఉండబోతుందో ప్రవచిస్తుంటాడు. ఇశ్రాయేలు (యెహోవా వలన నీతిమంతులుగా చేయబడి) నీతినిబట్టి ఉన్నతమైన గమ్యమునకు (ముగింపునకు) చేర్చబడతారని బిలాము ప్రవచిస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు దేశమంతటిని గురించి అంటున్నాడా లేదా ఒక్కొక్క ఇశ్రాయేలీయుని గురించి అంటున్నాడా స్పష్టంగ చెప్పలేము. నేనైతే ఒక్కొక్క ఇశ్రాయేలీయుని గురించి అంటున్నాడని అనుకుంటుంన్నాను. ఏదేమైనప్పటికి, మరణానంతరం ఇశ్రాయేలీయునికి (లేదా ఇశ్రాయేలు దేశమంతటికి) సంతోషకరమైన గొప్ప మేలు జరగబోతుంది అనేది అతని ప్రవచనము యొక్క సారాంశం.
చివరిగ, యోబు గ్రంథములో ఉన్న 19:25-27 వచనాలు మనం చూడాలి. చాలా క్లిష్టమైన వాక్యభాగము. తెలుగు బైబిల్ ఇలా ఉంది: “నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను” అని యోబు అన్నాడు.
ఇక్కడ ‘విమోచకుడు’ బదులు ‘తీర్పరి’ (vindicator) అనే తర్జుమ సరైనది. యోబు స్నేహితులు అతన్ని నిందిస్తున్న సంద్ర్భములో యోబు దేవుని న్యాయమైన తీర్పు కొరకు ఎదురుచూస్తున్నాడు. విమోచన అంటే మూల్యం చెల్లించి విడిపించడం. ఇది సందర్భానికి సరిపోదు.
అలాగే, ‘భూమిమీద’ అనే బదులు ‘ధూళిమీద’ (dust) అనే తర్జుమ అర్థవంతమైనది. ‘ధూళిమీద’ అనే పదము మనకు వెంటనే యోబు యొక్క సమాధిని గుర్తుచేస్తుంది. యోబు మరణించి ధూళిలో ఉన్న అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ సందర్భము అదే. ‘భూమిమీద’ అనే తర్జుమ కూడా మరొక భావన ఇస్తుంది, ‘దేవుని తీర్పు స్థిరమైనది’ అనే భావన. ఈ రెండింటిలో ఏది సరైన పదమో తరువాతి వచనం నిర్ణయించాలి, కాని ఆ వచనం (26వ వచనం) కూడా స్పష్టంగా లేదు.
26వ వచనం ముగింపులో మాత్రం “నేను దేవుని చూచెదను” అనే మాటలు సూటిగా ఉన్నాయి. దేవుడు ఇవ్వబోయే న్యాయమైన తీర్పులో ఒక భాగం ఏటంటే యోబు దేవున్ని కన్నులారా చూడడం. అతనికి దేవున్ని చూసే ధన్యత దొరికితే అప్పుడు తనకు న్యాయం చేకూరిందని భావిస్తున్నాడు. అప్పుడే యోబుకు నెమ్మది. ఆ దర్శనమే తన నీతికి నిజమైన ఫలం. ఈ వచనాల్లో పునరుత్థానము యొక్క ప్రస్థావన తప్పకుండా ఉందేమో గాని పదాల సమకూర్పు స్పష్టంగా లేనందున ఖచ్చితమైన నిర్ధారణ చేయలేము.
ఇవీ, పాతనిబంధన విశ్వాసులు మరణము తరువాత తమ స్థితిని, పునరుత్థానము గురించి మాట్లాడిన కొన్ని ముఖ్యమైన లేఖనాలు. “దేవా, నిత్యత్వాన్ని నా కన్నులపై ముద్రించుము,” అని ప్రార్థన చేసాడు ఒక దైవజనుడు.
{ఈ వ్యాసం Geerhardus Vos గారు రచించిన Old Testament Eschatology అనే పుస్తకములోనుండి సంక్షిప్తపరచబడింది.}
Geerhardus Vos is one of the prominent Reformed theologians. He was one of the renowned professors of the Princeton Theological Seminary. He is often called the father of Reformed Biblical Theology.